అమరావతి : కేంద్రం ప్రజలపై మోపుతున్న ధరలు, పన్నుల భారాన్ని ప్రశ్నించకుండా ఏపీ సీఎం జగన్ మౌనంగా ఉండడం వెనుక స్వార్థం ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆరోపిం చారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ను కేసుల ఉపసంహరణ కోసం కేంద్రంతో సాన్నిహిత్యంతో ఉంటున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారాన్ని జీఎస్టీ కౌన్సిల్లో వైసీపీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని తెలిపారు. పుదుచ్చేరి, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించాయన్నారు. జీఎస్టీ నష్టపరిహారాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని ఎందుకు కోరలేదని అన్నారు.
చట్టపరంగా రావాల్సిన హక్కులను కూడా అడగలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. జీఎస్టీ నష్టపరిహారంలో నష్టపోయేలా కేంద్రానికి మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.