అమరావతి : గత వైసీపీ పాలనలో నాయకత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రం అప్పులపాలయ్యిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazir ) అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పని చేస్తోందని ప్రశంసించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం ఒక గేమ్ ఛేంజర్ (Game changer) అన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వ పాలనలో లోపాలు, ఆర్థిక వైఫల్యం కారణంగా అప్పులు భారం పెరిగిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ( Visakha Steel Plant) కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు వివరించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమికి 93 శాతం మంది ఓటర్లు తీర్పునిచ్చారని అన్నారు.
7నెలల పాలనలో ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పనులు చేపడుతుందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తుందని పేర్కొన్నారు. ప్రణాళిక బద్దంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీ్కరించారు.