తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పురుష సూక్తంలోని మంత్రాల్లో స్వామివారిని ”సహస్రశీర్ష పురుషుడు” అని స్తుతించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని టీటీడీ అర్చకులు తెలిపారు. సోమవారం ముత్యాలకవచంతో, మంగళవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో ఏవి.ధర్మా రెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.