అమరావతి : ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో( Agency Areas) ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళనకరమని ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) అన్నారు. ఈ మేరకు ట్విటర్లో చంద్రబాబు( Chandra Babu) ప్రభుత్వం మొద్దు నిద్రే కారణమని ఆరోపించారు. కురుపాం ఘటన తర్వాతైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం సిగ్గుచేటని, ముక్కు పచ్చలారని బిడ్డలను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారని విమర్శించారు.
మన్యం జిల్లా హడ్డుబంగి పాఠశాల విద్యార్థిని మృతి కూటమి ప్రభుత్వం చేసిన వరుస హత్యనేనని ఆరోపించారు. బిడ్డ బంగారు భవిష్యత్ ను చిదిమేశారని, గురుకులాల్లో పిల్లల జీవితాలను గాల్లో దీపాలుగా మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు 16 నెలల పాలనలో 21 మంది బిడ్డలు చనిపోయారంటే వారి మృతదేహాలపై పాలన సాగుతున్నట్లు లెక్క అని పేర్కొన్నారు. వరుస మరణాలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
గిరిజన సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకమని, పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు కేంద్రాలుగా మారాయని అన్నారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కరువు. ఆర్వో ప్లాంట్లు పనిచేసిన దాఖలాలు లేవని అన్నారు.
గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరణించిన 21 మంది విద్యార్థులకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బడుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.