హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం స్వామివారిని 77,995 మంది భక్తులు దర్శించుకోగా, 30,250 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
స్వామివారి హుండీలకు రూ.3.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలిరోజు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు గ్రంథి పవిత్ర సమర్పణ, యాగశాల పూజ, హోమం, 20న మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు.