అమరావతి : ఏపీలో ప్రభుత్వం మారాక శరవేగంగా మార్పలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ఘన విజయం సాధించింది.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న ఉన్నతాధికారుల సెలవులను రద్దు చేయగా ఇప్పుడు
ప్రభుత్వ యూనివర్సిటీల ఉపకులపతులు(Vice Chancellors) హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఉన్నత విద్యాశాఖ(Higher education department) ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, ఎస్పీలను సంప్రదించి పరిష్కరించుకోవాలంది.
శాఖాపరమైన సమస్యలకు ఉన్నత విద్యాశాఖను సంప్రదించాలని సూచింది. ఇటు ఆంధ్ర వర్సిటీలో కీలక దస్త్రాలు మాయం అని పత్రికల్లో వచ్చిన వార్తలను అవాస్తవమని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుండటంతో.. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అధికార వర్గాల్లో గుబులు మొదలైందని పలువురు చర్చించుకుంటున్నారు.