Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఆ మధ్య పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో నకిలీ ఐపీఎస్ ప్రత్యక్షమవ్వడం టెన్షన్ పెట్టిస్తే.. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై ఒక డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. దీంతో పవన్ కల్యాణ్ భద్రతపై చాలా రకాల అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండ్రోజులుగా లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై కూటమి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఈ అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో పలు రకాల సర్వేల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆ డ్రోన్లలో ఒకటే జనసేన కార్యాలయాలపై ఎగిరినట్లు సమాచారం.
కాగా, పవన్ కల్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో పర్యటించిన ఆయన.. పవన్ భద్రత అంశాన్ని సీరియస్గా విచారిస్తున్నట్లు తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై ఈ సాయంత్రానికి విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సమయంలో నకిలీ ఐపీఎస్ ప్రత్యక్షమవ్వడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూస్తున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం ఘటనలో పోలీసు శాఖ వైఫల్యం లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం లేదని.. కేవలం పర్యటన పూర్తి అయిన తర్వాతే నకిలీ పోలీసు వచ్చినట్లు గుర్తించారని వివరించారు. దీనిపై కూడా విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.