తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిపారు. రాత్రి తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద శాత్తుమొర నిర్వహించారు.
అనంతరం ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చి కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.