Srisailam | నంద్యాల: తిరుమల తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్తో కలిసి కలెక్టర్ చాంబర్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ.. పర్యాటక రంగ అభివృద్ధిట్ష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం మహా క్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నివేదికలు పంపాలని గత సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన దేవాదాయ, పర్యాటక, ఆర్ అండ్ బీ మంత్రుల కమిటీ సమావేశంలో నిర్దేశించారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు అవసరమయ్యే నివేదికలను శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలని దేవాదాయ, అటవీ, సర్వే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాబోయే రెండేండ్లలో శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల క్షేత్ర తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో నివేదికలు తయారు చేసి ఇస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
గతంలో దేవాదాయ, అటవీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను కూడా పొందుపరచాలని సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ ఆదేశించారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన అటవీ విస్తీర్ణం, అటవీ సరిహద్దుల సర్వే, గెజిట్ నోటిఫికేషన్, నందికొట్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల నిషేధిత భూములు సంబంధిత వివరాలతో నివేదికలు అందజేయాలని డీఎఫ్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.
శ్రీశైల దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములు, అటవీ సరిహద్దుల నుంచి రక్షణ గోడలు, తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన నివేదికలను అందజేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ను కలెక్టర్ కోరారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి గతంలో మంత్రుల కమిటీ సూచించిన అంశాలు, తయారు చేసిన నివేదికలను కూడా అందచేయాలన్నారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు ప్రతిపాదనలు, రహదారి విస్తరణ సంబంధించిన పనులు కూడా మాస్టర్ ప్లాన్ నివేదికలో పొందుపరుస్తామని కలెక్టర్ తెలిపారు.