అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా.. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లిష్ పేపర్ లీకయిందనే వార్తలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి అధికారి ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, మరో జూనియర్ అసిస్టెంట్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో టెన్త్ ఇంగ్లిష్ పేపర్ లీక్ అయింది. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ పేపర్ లీకేజీకి సెంటర్ సూపరింటెండెంట్, హెడ్మాస్టర్ విజయ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రావులను సూత్రధారులుగా అనుమానిస్తున్నారు. కాగా, విజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రావు పరారీలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఇలాఉండగా, నంద్యాల జిల్లాలో పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతున్నది. ఈ కేసులో మరో 9 మంది ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 19 మందికి చేరింది. అంకిరెడ్డిపల్లె పరీక్షా కేంద్రంలో బాధ్యతలు విస్మరించిన అధికారులు మాస్ కాపీయింగ్‌కు సహకరించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.