Accident | అమెరికాలో విషాదం నెలకొంది. టెన్నెసీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి దుర్మరణం చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ(26) ఉన్నత విద్యాభ్యాసానికి 2022 డిసెంబర్లో అమెరికా వెళ్లింది. అక్కడే టెన్నెసీ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె స్నేహితులతో కలిసి వెళ్తుండగా రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పరిమళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఈ ప్రమాదంలో నికిత్, పవన్ అనే మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పరిమళ మృతదేహాన్ని అమెరికా నుంచి వీలైనంత తొందరగా తెనాలికి తీసుకొచ్చేందుకు తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు వెల్లడించారు.