Botsa @ Yadadri | యాదాద్రి దేవస్థానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహాద్భుతంగా తీర్చి దిద్దారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఆ దేవుడి ఆశీస్సులుండఆలని వేడుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన తన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ప్రాకారంలోని అద్దాల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. తమ కుమారుడి వివాహం తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లానని, ఆ తరువాత తమ ఇష్ట దైవమైన యాదగిరిగుట్టకు వచ్చినట్లు తెలిపారు.
ఏడేండ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు బొత్స చెప్పారు. అంతకుముందు 2015లో దర్శించుకున్నానని వెల్లడించారు. నాటికీ నేటికీ యాదాద్రి ఆలయ రూపురేఖలు మారిపోయాయన్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.