అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ సారా, జె- బ్రాండ్స్ మద్యానికి వ్యతిరేకంగా టీడీపీ రెండురోజుల పాటు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కల్తీ సారా అరికట్టాలి, జె. బ్రాండ్స్ మద్యం నిషేధించాలి’ అనే డిమాండ్ తో ప్రభుత్వాన్ని నిలదీయాలని అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం చేస్తాం అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఏపీ సీఎం జగన్ మాట తప్పి, మడమ తిప్పారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీసారాతో 19 మంది 26 మంది మరణించారని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సీసాలను ధ్వంసం చేశారు. పాత గుంటూరు ఎన్టీఆర్ కూడలిలో చేపట్టిన కార్యక్రమంలో నాటుసారా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ర్యాలీగా వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కల్తీ సారా మరణాలను సహజ మరణాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యనించడం బాధాకరమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచి రూ. 6వేల కోట్ల ఆదాయాన్ని 20వేల కోట్లరూపాయలకు పెంచుకున్నారని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ర్యాలీ నిర్వహించి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.