First list: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకున్నది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ సభలు పెట్టి ఒకరినొకరు దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ శాసనసభ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎన్నికల వేడి మరింత ఊపందుకుంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి తమతమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెండు పార్టీల సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన మొత్తం 175 స్థానాలకుగాను 24 అసెంబ్లీ స్థానాల్లో, మొత్తం 25కు గాను మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. తొలి జాబితాలో ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్థుల్లో బెందాళం అశోక్ ఇచ్ఛాపురం నుంచి, అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, కొండ్రు మురళి రాజాం నుంచి పోటీపడనున్నారు. అదేవిధంగా ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, గజపతినగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, పాలకొల్లు నుంచి నిమ్మల రామనాయుడు, జగ్గంపేట నుంచి వెంకట అప్పారావు బరిలో దిగబోతున్నారు. ఇక ఐదుగురు అభ్యర్థులతో కూడిన జనసేన తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్ (తెనాలి), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం) ఉన్నారు.