Chandrababu | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేత పట్టాభి ఇంటితోపాటు టీడీపీ కార్యాలయాలపై దాడుల పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించే వారే లేరని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాడుల విషయంలో సీఎం వైఎస్ జగన్, డీజీపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు. డీజీపీ ఆఫీసు పక్కనే టీడీపీ కార్యాలయం ఉందని, దాడి జరుగుతున్నదని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇటువంటి వారు రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏం కాపాడతారంటూ ఫైరయ్యారు.
డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నదని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై పథకం, ప్రణాళిక ప్రకారం దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ.. నేరస్థులతో లాలూచీ పడతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీని భయబ్రాంతులకు గురి చేస్తారా? అని అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పాటించని ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు 356 అధికరణాన్ని ఎందుకు ప్రయోగించకూడదని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడదామంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంపై దాడులు చేసే శక్తులపై యుద్ధం చేద్దామన్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్ పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతున్నదని డీజీపీకి ఫోన్ చేస్తే.. సమావేశంలో బిజీగా ఉన్నానని సమాధానమిస్తారా? అని మండిపడ్డారు.
దాడులపై ఫోన్ చేస్తే గవర్నర్, కేంద్ర మంత్రి ఫోన్ ఎత్తారని చంద్రబాబు చెప్పారు. కొందరు చేసే పనులతో మొత్తం పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని వ్యాఖ్యానించారు. రెండున్నరేండ్లు జరుగుతున్న వేధింపులను భరిస్తున్నామని, ఇప్పుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడుల సమాచారం తెలియని వ్యక్తి డీజీపీ పదవికి ఎలా అర్హుడని చంద్రబాబు ప్రశ్నించారు.