Chandrababu | టీడీపీలో కోవర్టు రాజకీయాలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు హెచ్చరించారు. ఇక కుమ్మక్కు రాజకీయాలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ పార్టీ అభ్యర్థులతో సమీక్షించారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్న ఇద్దరు నేతలను సస్పెండ్ చేశారు.
టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత పార్టీ నేతలకు లేదా? అని మండి పడ్డారు. కుల, మత రాజకీయాలు చేసేవారు పార్టీకి అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీని ఎలా పటిష్టం చేయాలో తనకు తెలుసునన్నారు. పార్టీలోకి యువ రక్తాన్ని తీసుకొస్తానని, క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేసే వారికే పార్టీ పదవులు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత మరికొందరిపై వేటు పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు.