Somireddy | వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 11 స్థానాల్లో గెలిచిన జగన్ మాట్లాడటానికి గంటలు గంటలు సమయమిచ్చి.. 164 సీట్లు గెలిచిన వాళ్లు గోళ్లు గిల్లుకోవాలా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్.. రేపు సీఎం పదవి కావాలంటారేమో అని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అడగడంపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 1994లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రాలేదు.. కానీ సభకు హాజరై పోరాడారని తెలిపారు. 1984లో లోక్‌సభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా రాకపోయినా విపక్షాలు పోరాడాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు అసెంబ్లీకి రావడానికి జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను చూసే ధైర్యం జగన్‌కు లేదని విమర్శించారు. జగన్ వస్తే లిక్కర్ స్కాం, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో చేసిన దోపిడీ ఇలా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని కుంభకోణాల మీద అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అర్హతే ఆయన కోల్పోయారని దుయ్యబట్టారు.