Kotamreddy Sridhar Reddy | వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిజంగా నేను రాజకీయ, ఆర్థిక దందాలు చేసి ఉంటే.. నాపై మీ జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 18 నెలలు జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలు అయ్యింది.. మేం ఏ వైసీపీ నేతపై అయినా, కార్యకర్తపై అయినా దాడులు చేశామా? వేధించామా? వెంటాడామా? అక్రమ కేసులు పెట్టామా? చెప్పాలని అన్నారు.
నెల్లూరులో శనివారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఆ 18 నెలలు మీరు చేసిన పాపాలు, దుర్మార్గాలు గుర్తుకొస్తూనే ఉంటాయని అన్నారు. నన్ను, నా కుటుంబసభ్యులను, నా తమ్ముడిని వేధించినట్టే వేధించాలనే అనుకుంటే.. ఇప్పుడు కచ్చితంగా చుక్కలు చూపించేవాడిని అని వ్యాఖ్యానించారు. కానీ మా అధినేత చంద్రబాబు గీత దాటితే తాటతీస్తారని చెప్పారు. చట్టవిరుద్దధమైన ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని చంద్రబాబు, లోకేశ్ క్లియర్‌గా చెప్పారు కాబట్టే.. మేం చేతులు కట్టేసుకున్నామని స్పష్టం చేశారు. నాకే కాదు రాష్ట్రంలోని అందరికీ అవే ఆదేశాలిచ్చారని వివరించారు. వైసీపీ కార్యకర్తల్లారా.. పండుగ చేసుకోండి.. నన్ను అనవసరంగా కెలకొద్దు అని సూచించారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం.. ప్రజల కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు కొనసాగిస్తే మాత్రం అందుకు పదింతలు బదులిస్తామని హెచ్చరించారు.
నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోలు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఫారసు చేశారని వైసీపీ ఆధారాలు చూపిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోలు ఇవ్వాలని ఆయన తండ్రి, సోదరుడు వస్తే సిఫారసు లేఖ ఇచ్చానని చెప్పారు. వివిధ సమస్యలతో వచ్చేవారికి ఎమ్మెల్యేలు ఈ లేఖలు ఇస్తారని.. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం పంపిస్తారని వివరించారు. శ్రీకాంత్‌కు పెరోలు ఇవ్వాల్సిందిగా తానూ, ఎమ్మెల్యే పాశం సునీల్ సిఫారసు లేకలు ఇచ్చినప్పటికీ వాటిని హోం శాఖ పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.
తాను ఇచ్చిన సిఫారసు లేఖను తిరస్కరిస్తూ అధికారులు జూలై 16వ తేదీన సమాధానం పంపించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. జూలై 30న అధికారులు శ్రీకాంత్‌కు పెరోలు మంజూరు చేశారని పేర్కొన్నారు. తమ లేఖను తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోలు మంజూరు చేశారని చెప్పారు. పెరోలు అంశంపై విచారణ చేయిస్తున్నామని హోంమంత్రి చెప్పారని.. నా సిఫారసు లేఖను తిరస్కరించిన 14 రోజుల్లోనే అధికారులు పెరోలు ఎఇలా ఇచ్చారోనని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఇదే శ్రీకాంత్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సిఫారసు లేఖలు ఇచ్చారని కోటంరెడ్డి తెలిపారు. వారిని తప్పుబట్టడం లేదని.. ప్రజా ప్రతినిధుల వద్దకు రకరకాల బాధలతో ప్రజలు వస్తుంటారని.. ఆ లేఖల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాజకీయ జీవితంలో ప్రతిదీ గుణపాఠమేనని.. ఇకపై జీవితంలో ఎవరికీ పెరోలుకు సిఫారసు లేఖ ఇవ్వనని తేల్చిచెప్పారు.