పీఏసీ ఎన్నికను బాయ్‌కాట్ చేశామంటున్నారని.. బలం లేకుండా నామినేషన్ వేసి బాయ్‌కాట్ చేయడమేంటని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లు మాకు అసెంబ్లీలో మైక్ ఇచ్చారా అని ప్రశ్నించారు .అసెంబ్లీకి రావడానికి వైసీపీకి ఎందుకంత భయమని నిలదీశారు. ప్రజా నాయకుడివే అయితే భయం ఎందుకు అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. నిజాయితీ గల నాయకులను కూడా అక్రమంగా అరోస్టు చేశారని అన్నారు.
ఏపీలో అవినీతి ఖ్యాతిని జగన్ విశ్వవిఖ్యాతం చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రూ.60వేల కోట్లు దోచుకుని జగన్ ఈడీ కేసులో ఉన్నారని అన్నారు. 12 ఏళ్లుగా కేసును జగన్ నడుపుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు. కేసులు ఎలా పొడిగించాలో తెలిసిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. జైలు పక్షి జగన్ నేరస్తుడు, అవినీతిపరుడు, పిరికివాడు తాలిబన్ కంటే ఘోరమని విరుచుకుపడ్డారు. జగన్ దోపిడీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.