AP News | కడపలో చెత్త సేకరణ వివాదం మరింత వేడెక్కింది. కడప వైసీపీ మేయర్ సురేశ్‌బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య రెండు రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం ఇవాళ ఉద్రిక్తతకు దారి తీసింది. పన్ను కట్టకపోతే చెత్త సేకరించవద్దని మేయర్ చెబుతుంటే.. చెత్త పన్ను వసూలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పిలుపు మేరకు టీడీపీ నేతలు జనంతో కలిసి చెత్తను తీసుకొచ్చి మేయర్ ఇంటి ముందు వేసి నిరసనలు తెలిపారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నిరసనలు తెలిపారు.
మేయర్ ఇంటి ముందు చెత్తను పారబోయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక మేయర్ ఇంటి ముందు ఇలా చెత్త వేయడమేంటని నిలదీశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తాము కూడా ఇలాగే చేయాల్సి ఉంటుందని హెచ్చరించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల చర్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు. అయితే మేయర్ ఇంటి నుంచి వెళ్లిపోయిన వైసీపీ శ్రేణులు కడపలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగాయి. పీఎస్ ముందు బైఠాయించి టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశాయి.
కడప మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన ప్రజలు
చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకువెళ్ళమన్న మేయర్ సురేశ్ బాబు.
చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.
మేయర్ ఇంటిని ముట్టడించి చెత్తను ఇంటి ముందు పోసిన జనం. pic.twitter.com/GzdByjbfmI
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024
తన ఇంటి ముందు చెత్త వేయడంపై కడప మేయర్ సురేశ్ బాబు స్పందించారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు.. అప్పుడే అరాచక పాలన మొదలుపెట్టారని సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలు తన ఇంటి ముందుకొచ్చి ఇంత అరాచకం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే తన ఇల్లు ఉందని.. పోలీసులకు తెలియకుండానే ఇంటి వద్ద చెత్త వేశారా అని నిలదీశారు. తాము అనుకుంటే ఎమ్మెల్యే ఇంటిని కూకటి వేళ్లతో తొలగించగలమని.. కానీ తమ నాయకుడి ఆదేశాల మేరకు శాంతియుతంగా ఉన్నామని స్పష్టం చేశారు.