ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బలహీనుడో ఇట్టే తేలిపోయిందని టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. మంత్రివర్గ కూర్పును నిరసిస్తూ ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు, అసంతృప్తులు వ్యక్తం చేయడం తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే ప్రథమమని ఎద్దేవా చేశారు. నూతన కేబినెట్ కూర్పులో సమతౌల్యత ఉందని అధికార వైసీపీ పదే పదే చెప్పుకుంటోందని, కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదని, అలాంటప్పుడు ఎలా సమతౌల్యత అవుతుందని సూటిగా ప్రశ్నించారు.
విశాఖ, విజయవాడ, తిరుపతితో పాటు మరో 8 జిల్లాలకు మంత్రులు లేకుండానే కూర్పు జరిగిపోయిందని చురకలంటించారు. ఎన్నికలకి సరిగ్గా రెండేళ్ల ముందే సీఎం జగన్ బీసీలకు ప్రాధాన్యమిచ్చారని, దానిని తెగ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల ముందే బీసీలకు ప్రాధాన్యమిచ్చారని, వైసీపీని బీసీలు ఏమాత్రం విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు. అధికార వైసీపీ నేతలు ఎంత ప్రయత్నించినా.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారని గంటా ధీమా వ్యక్తం చేశారు.