ఏపీ కేబినెట్ మూకుమ్మడి రాజీనామాపై ప్రతిపక్ష తెలుగు దేశం ఘాటుగా స్పందించింది. గజ దొంగ తప్పించుకొని, 25 మంది దొంగలు రాజీనామా చేసేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసి ఏపీని దివాలా తీశారని, అసమర్థ, దద్దమ్మ మంత్రులు ఎక్కడుంటే ఏమవుతుందని విమర్శించారు.
ఏపీలో పాలన అంతా అస్తవ్యస్తమైందని, పాలనా వైఫల్యం అంతా సీఎందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ కూడా రాజీనామా చేయాలని ఉమ డిమాండ్ చేశారు. 24 మంది దొంగలు అవుట్ అయ్యారని, గజ దొంగ ఎప్పుడు అవుట్ అవుతారని నిలదీశారు. 24 మందీ అసమర్థులైనప్పుడు, సీఎం జగన్ ఎలా సమర్థుడవుతారని ప్రశ్నించారు. అసమర్థ రత్న, అసమర్థ మిత్ర అన్న బిరుదులిచ్చి, మంత్రులకు శాలువాలు కప్పాలని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.
మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీంట్లో భాగంగా సచివాలయంలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఇవాళ తొలి మంత్రివర్గంలో ఉన్న వారందరీ చేత రాజీనామా చేయించారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ఏపీ సీఎం జగన్కు అందజేశారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.