YS Jagan | వైఎస్ జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం దక్కుతుందని జగన్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కళ్లు మూసుకుని ఉన్నందుకే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పెద్ద సైకో అని మరోసారి నిరూపించుకున్నాడని బుద్ధా వెంకన్న విమర్శించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఎదగనివ్వలేదని బుద్ధా వెంకన్న అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అప్పుడు అమరావతిని చంపేసేందుకు శాసన మండలిని రద్దు చేస్తానని జగన్ అన్నారని గుర్తు చేశారు. అప్పుడు మండలి అవసరం లేదని చెప్పి.. ఇప్పుడు మండలిలో తమకు బలం ఉందని చిలక పలుకులు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లు జగన్ కళ్లు మూసుకుని పని చేశాడని.. కళ్లు తెరిచి పనిచేసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేదని అన్నారు. నిర్లక్ష్య పాలన కారణంగానే జగన్ను ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. అసలు అవినీతి కేసుల్లో శిక్ష పడితే జగన్కు పోటీ చేసే అవకాశం కూడా ఉండదని అన్నారు.