Budda Venkanna | మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సీరియస్ అయ్యారు. కొడాలి నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఆ గన్నవరం పిల్లి ఏమైందని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీకి టికెట్ ఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. టీడీపీలో ఉంటే ఎవరైనా హీరోలే అని.. బయటకెళ్తే జీరోలు అని విమర్శించారు. అసలు రుషికొండపై ప్యాలెస్‌లు ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ ఫర్నీచర్ దొంగ అని విమర్శించారు. ప్రజాధనం దొంగతనం చేసి డబ్బులు ఇస్తామంటారా? అని మండిపడ్డారు.
కాగా, తాడేపల్లిలో గురువారం జరిగిన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రుషికొండలోని భవనాలను జగన్ నివాసాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం శాఖ కోసం నిర్మించిన బ్లాక్‌లను వైఎస్ జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన ఖర్మ జగన్‌కు లేదని.. వైజాగ్‌లో సొంతిల్లు కట్టుకుని షిఫ్ట్ అవుతారని తెలిపారు. ‘ ముష్టి ఫర్నీచర్, తొక్కలో ఫర్నీచర్ ఎంతుంటుంది? డబ్బులిస్తాం పట్టుకుపొమ్మని చెప్పాం. కావాలంటే తీసుకెళ్లండి. ఆ ఫర్నీచర్ ఏమైనా సాక్షిలో పెట్టుకున్నామా? క్యాంప్ ఆఫీసులో పెట్టిన ఫర్నీచర్ ఇంకెక్కడైనా పెట్టామా ?’ అంటూ మండిపడ్డారు.