Rushikonda | రుషికొండ భవనాలపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి రోజా సెల్వమణి చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. గతంలో సీఎం ఉండటానికి నివాసం అని.. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారని చెప్పి.. నేడు పర్యాటకుల కోసం నిర్మించామని మాట్లాడుతున్నారని అన్నారు. రోజాను విచారిస్తే అసలు నిజాలు ఏంటో, నాడు చెప్పిన త్రిసభ్య కమిటీ కథ ఏంటో మొత్తం బయటకు వస్తుందని అన్నారు.
వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అని రోజా విమర్శలపైనా బుద్ధా వెంకన్న స్పందించారు. వర్షానికి కారిపోయే భవనాల్లో ఐదేళ్లు ఎలా పాలన చేశారని ప్రశ్నించారు. రుషికొండలో అత్యంత నాణ్యతతో నిర్మించిన భవనాలు ఎవరికోసమని ప్రశ్నించారు. ఓటమి కారణంగా రోజాకు మతి భ్రమించినట్లు ఉందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
రుషికొండ భవనాలు రాష్ట్రపతి కోసమని కాసేపు.. రాష్ట్ర ప్రభుత్వానికి అని కాసేపు చెబుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అసలు రుషికొండను బోడి గుండు చేయమని మీకు ఎవరు చెప్పారని మాజీ మంత్రి రోజాను ప్రశ్నించారు. దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లుగా మీ కబుర్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో సోకులు చేసుకునేందుకు సిద్ధమైన మీకు ఆ ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు.