BTech Ravi | కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచక పాలన నడుస్తోందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.
కడప జిల్లాలో గురువారం నాడు ఎంపీ అవినాశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేదని అన్నారు. అప్పుడు అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కృతి లేదని విమర్శించారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదని.. జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలని హితవు పలికారు.
కాగా, పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. గడిచిన ఐదేండ్లలో మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టించుకున్నది ఎవరో పులివెందుల ప్రజలకు తెలుసని అన్నారు. అలాగే అక్రమ మైనింగ్ వ్యాపారం చేసింది వైఎస్ కుటుంబమే అంటూ ఆరోపించారు. వైఎస్ కుటుంబం రాజకీయ పునాదులు అక్రమ మైనింగ్ ద్వారానే మొదలైందని చెప్పారు. 40 ఏళ్లుగా అక్రమ మైనింగ్ వ్యాపారం వైఎస్ కుటుంబ కనుసన్నల్లోనే జరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మట్కాను పులివెందుల నియోజకవర్గం నుంచి కూకటివేళ్లతో పెకలించడం జరిగిందని స్పష్టం చేశారు.