ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ అరెస్ట్‌పై టీడీపీ తీవ్రంగా స్పందించింది. సీఎం జగన్‌ది అసమర్థ పాలన అని, దీని నుంచి దృష్టి మరల్చడానికే నారాయణను అరెస్ట్ చేశారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ అక్రమ అరెస్ట్‌ను తాము ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎలాంటి నోటీసులు లేకుండానే, పోలీసులు ఇష్టారీతిన నారాయణను అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
ఏపీలో సీఎం జగన్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రే చెబుతుంటే నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
ఇదే విషయంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని.. కక్షసాధింపు చర్యల్లో భాగమే ఈ అక్రమ అరెస్ట్ అని దేవినేని ఉమ ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ సర్కార్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందన్నారు. మీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని దేవినేని ఉమ స్పష్టం చేశారు.
ఇక.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఈ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర కోణం దాగుందని బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. టీచర్ల ఆందోళన సమయంలో టీచర్లు అనేక ఆరోపణలు చేశారని, అందుకే జగన్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు కొంత మంది టీచర్లను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారని వెంకన్న మండిపడ్డారు.