AP News | ఏపీలో పొత్తుల వేళ అనంతపురం అర్బన్‌లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు కుదిరినప్పటికీ ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో అనంతపురం అర్బన్ టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గ టికెట్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న ప్రభాకర్ చౌదరి.. అనంత అర్బన్ టికెట్ తనకు ఇస్తే టీడీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇదే టికెట్‌ను జనసేన కూడా కావాలని అనుకుంటుంది. అంతేకాదు.. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం అర్బన్ టికెట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. తనకు టికెట్ రాదని ఎగతాళి చేసే వారి అకౌంట్లు తొందరలోనే సెటిల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తొందరలోనే చంద్రబాబును కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అనంతపురం అర్బన్‌లో పోటీ చేస్తే.. తన సీటు త్యాగం చేస్తానని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఒకవేళ అనంతపురానికి పవన్ కల్యాణ్ వస్తే ఆయన్ను గెలిపించేందుకు పనిచేస్తానని తెలిపారు. తన భుజస్కంధాలపై వేసుకుని మరీ పవన్ కల్యాణ్ గెలిపిస్తానని స్పష్టం చేశారు. కాగా, బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో అనంత అర్బన్ టికెట్‌పై జనసేన పార్టీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే జనసేన తరఫున టీసీ వరుణ్‌కు టికెట్ ఆశిస్తున్నాడు. కానీ ప్రభాకర్ చౌదరి మాత్రం పవన్ కల్యాణ్ తప్ప మరెవరు వచ్చినా.. తగ్గేదేలేదని పట్టుదలతో ఉన్నాడు. మరి ఈ సమస్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో!