Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగి చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయన్ను పట్టుకున్నారు.
ఏపీలో తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించి.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో చంద్రబాబు శ్రమిస్తున్నారు. వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లోనే టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి నియోజకవర్గంలోని కాతేరులో సోమవారం నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, టీడీపీ, జనసేన మధ్య పొత్తుల విషయంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజానగరం టికెట్‌ను జనసేనకు కేటాయించడం పట్ల బొడ్డ వెంకటరమణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. తమ నిరసన తెలిపేందుకు స్టేజిపైకి ఎక్కారు. అదే సమయంలో పలువురు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు బొకేలు, పూలదండలు వేసేందుకు చంద్రబాబు దగ్గరకు వచ్చారు. దీంతో స్టేజిపైనే తోపులాట జరిగింది. ఆ తోపులాటలో చంద్రబాబు ఒకవైపు ఒరిగి కిందపడబోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు పడిపోకుండా పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. టీడీపీ నేతల తీరుపై చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
Security saves Chandrababu Naidu from falling off stage in today’s Rajahmundry ‘Ra.. Kadaliraa..’ of the TDP.#PakkaTelugu #Tdp #Rajahmundry #Chandrababu #CMJagan #AndhraPadesh #Andhra #NaraLokesh #janasena #NaraChandraBabuNaidu pic.twitter.com/a9Ghk52LAO
— Pakka Telugu (@PakkaTelugu_com) January 29, 2024