Free Sand Policy | ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ కొత్త దందాకు తెరలేపిందని వైసీపీ ఆరోపించింది. ఎవరెవరివో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు, చిరునామాలు చూపిస్తూ ఇసుక లోడ్ చేయాల్సిందిగా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించింది. స్టాక్ యార్డుల వద్ద వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయని పేర్కొంది. రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి అవసరమైన వారికి అధిక ధరలకు అమ్ముకునేందుకు ఎత్తుగడ వేసిందని విమర్శించింది.
చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయడని.. అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం బాబు నైజమని వైసీపీ విమర్శించింది. పేరుకే ఉచిత ఇసుక విధానం.. దీని పేరుతో కోట్లు దోచుకుంటున్నారని మండిపడింది. ఇసుకను ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధరలను వెల్లడించింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో దగ్గర టన్ను ఇసుకను రూ.1225కి విక్రయిస్తున్నారని.. విశాఖలోని అగనంపూడి డిపో వద్ద ఇసుక ధర రూ.1394కు, అనకాపల్లి జిల్లా నక్కపల్లి డిపో వద్ద ఇసుక ధర రూ.1125 విక్రయిస్తున్నారని చెప్పింది. దాదాపు ఇవే రేట్లతో వైసీపీ ఇసుక అందించిందని తెలిపింది. ప్రతి నియోజకవర్గాల వారీగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా ఇసుకను అందించిందని చెప్పింది. టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో కూడా నియోజకవర్గాల వారీగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందని తెలిపింది.
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర ఏడాదికి రూ.750 కోట్లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరితే.. ఇప్పుడు ఈ డబ్బు నేరుగా టీడీపీ కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తోందని చెప్పింది. మీరు ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారని.. సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించింది.