AP News | కారు ప్రమాదంపై వివరణ ఇస్తూ వైఎస్ విజయమ్మ రాసినట్లుగా ఒక లేఖను ఇటీవల వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ లబ్ధి కోసం తన కుమారుడు జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో ఉంది. అయితే ఆ లేఖ రాసింది విజయమ్మ కాదని.. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారని టీడీపీ ఆరోపించింది. కొద్దిరోజుల క్రితం షర్మిల రిలీజ్ చేసిన లేఖలో విజయమ్మ సంతకానికి.. వైసీపీ విడుదల చేసిన లేఖలో ఉన్న సంతకానికి పొంతన కుదరలేదు. దీంతో టీడీపీ పలు అనుమానాలను లేవనెత్తింది.
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని విజయమ్మ చెప్పడంతో వైసీపీ ఇటీవల పోస్టు చేసిన లేఖను కూడా డిలీట్ చేసిందని టీడీపీ తెలిపింది. ఈ ఫోర్జరీ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సైకో జగన్ తన నీచనికృష్ట బుద్ధితో ఏకంగా తల్లి సంతకాన్నే ఫోర్జరీ చేశారని టీడీపీ విమర్శించింది. ఏకంగా తల్లి సంతకం ఫోర్జరీ చేసిన సైకో నీ బతుకు మొత్తం ఇలాంటి కల్తీ పనులేనా అని మండిపడింది. ఇలాంటి సంతకాలు ఫోర్జరీ చేసి, చెల్లి ఆస్తులు కొట్టేశావా అని జగన్‌ను నిలదీసింది. ఇలాంటి సంతకాలు ఫోర్జరీ చేసి, బాబాయ్‌ను వేసేసి లెటర్ రాయించావా? అని ప్రశ్నించింది. ఇలా సంతకాలు ఫోర్జరీ చేసే, తల్లిపై ఎన్సీఎల్టీలో కేసులు వేశావా? అని ప్రశ్నించింది.
విజయమ్మ రాసిందని పేర్కొంటూ వైసీపీ పోస్టు చేసిన లేఖలో ఏమున్నదంటే..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతోంది. నన్ను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉంది. వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ వివరణ రాస్తున్నాను. రెండు రోజుల కిందట నా కారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని … నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చెయ్యడం అత్యంత జుగుప్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రికరించి… భయపడి నేను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇకముందు ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపితే మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారు. ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే నేను చూస్తూ ఊరుకోదలచుకోలేదు.