తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివార ఆస్థానం (Salakatla Anivara Asthanam) శాస్త్రోక్తంగా జరిగింది. ఉభయదేవేరులతో మలయప్పస్వామివారిని ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో తీసుకువచ్చి గరుత్మంతునికి అభిముఖంగా ఉంచారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనులవారిని దక్షిణాభిముఖంగా ఉంచారు. ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు చేశారు.
సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమిళనాడు(Tamilnadu) దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు(Minister Shekar Babu) , తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార గురుబాలన్, శ్రీరంగం ఆలయ ఆలయ జాయింట్ కమిషనర్ మారియప్పన్ పాల్గొన్నారు.