Tadipatri | తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో జేసీ కుటుంబం అరాచకాలపై వైసీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాడిపత్రి అల్లర్ల ఘటనను వివరించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించానని.. అప్పుడు తనపై జేసీ వర్గీయులు దాడికి దిగారని వైసీపీ నేత మురళి తెలిపారు. దీంతో తాను భయపడి వెనక్కి వచ్చేశానని చెప్పారు. కాసేపటికే వారంతా తమ ఇంటిపైకి దాడి వచ్చారని పేర్కొన్నారు. వందల మంది మారణాయుధాలతో తమ ఇంటిపైకి వచ్చి దాడి చేశారని తెలిపారు. ఇసుప తలుపులను, కిటికీలను పగులగొట్టి మరీ ఇంటి లోపలికి వచ్చారని తెలిపారు. టీడీపీ నేతల అరాచకంపై ఫోన్ చేసినా పోలీసులు రాలేదని చెప్పారు. పదే పదే ఫోన్ చేస్తే 45 నిమిషాల తర్వాత వచ్చారని చెప్పారు. చిన్న పిల్లలు, ఆడవాళ్లపై దాడులు చేసి.. తిరిగి తనపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ ఫైరింగ్ చేయలేదని మురళి తెలిపారు. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. చిన్న పిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా అని మండిపడ్డారు. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు.