తాడిపత్రి జనసేన ఇంచార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దొంగలతో పోలీసులు చేతులు కలిపారని శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఆయన్ను అరెస్టు చేశారు.
తాడిపత్రిలో దొంగలతో పోలీసులు చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని జనసేన నేత కదిరి శ్రీకాంత్ శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శనివారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. తమపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. కానీ వివరణ ఇవ్వాలని ఇంటికి వచ్చిన పోలీసులతోనూ శ్రీకాంత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సీఐ ప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు.
జనసేన నేత శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆ వెంటనే విడుదల చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? ఆ వెంటనే ఎందుకు విడుదల చేశారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.