చిత్తూరు : తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఓ వ్యక్తి శరీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వను(10 ఎంఎం సైజు) వైద్యులు తొలగించారు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కే లక్ష్మయ్య వృత్తిరీత్యా తాపీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ నెల 27న పని చేస్తుండగా, పై అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఈ క్రమంలో అతని పిరుదుల నుంచి ఎడమ భుజం వరకు 3 అడుగుల ఇనుప చువ్వ చొచ్చుకెళ్లింది.
దీంతో అతన్ని విజయవాడ, గుంటూరులోని ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిన్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీటీ సర్జరీ విభాగం వైద్యురాలు డాక్టర్ సత్యవతి, మత్తు వైద్యనిపుణులు డాక్టర్ మధుసూదన్ కలిసి అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. అతని శరీరంలో నుంచి ఇనుపచువ్వను తొలగించారు. ప్రస్తుతం లక్ష్మయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.