Srisailam Temple | శ్రీశైలం : ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళవారం వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వకః ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. అనంతరం స్వర్ణరథోత్సవం నిర్వహించారు. అంతకు ముందు ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణాని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తర్వాత రథంపై ప్రతిష్టించి.. శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం 7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు.. అక్కడి నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవం కొనసాగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, నామసంకీర్తన అలరించాయి. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, పండితులు, పలు విభాగల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.