అమరావతి : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై (SC and ST sub-categorization ) సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. ఏడుగురు సభ్యులుగా జడ్జిల్లో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయం చెప్పడం అభినందనీయమని అన్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు.
సామాజిక న్యాయం(Social Justice) తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, అందరికి న్యాయం జరుగాలనే లక్ష్యంతో 1996-97లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామచంద్రారావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన తరువాత ఏబీసీడీ వర్గీకరణను తీసుకొచ్చానని తెలిపారు.
జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు, ప్రతి మతం, వర్గాలకు న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, మంత్రి వర్గ కూర్పులో సామాజిక న్యాయాన్ని అమలు చేశామని వివరించారు.