OMC Case | ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి సుధాంశు ధులియా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏడుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ సాధికార కమిటీ నుంచి ఒకరు ఉండనున్నారు. అలాగే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి ముగ్గురు సభ్యులుగా ఉండనున్నారు. మూడు నెలల్లో నివేదిక అందిచాలని కమిటీకి సీఐజే సూచించారు.