అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ (ఏఎమ్ఆర్డీఏ) కి నోటీసులు జారీ చేసింది.
అమరావతిలో నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ కంపెనీ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీకి డిజైన్ల కోసం అవగాహన కుదుర్చుకున్నది. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు రాజధాని అమరావతి డిజైన్లను ఆ కంపెనీ సిద్ధం చేసి జగన్ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, జగన్ ప్రభుత్వం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తెరపైకి మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చింది. దాంతో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఏపీ ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మేరకు తమకు 2019 జూన్ తర్వాత నుంచి రావాల్సిన మొత్తం బకాయిలు చెల్లించాలంటూ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ జగన్ ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసింది. ఈ లేఖలను కూడా జగన్ సర్కార్ పట్టించుకోక పోవడంతో సదరు కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యవర్తిత్వం పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.