Kethireddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలోకి అడుగుపెట్టేందుకు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.తాడిపత్రిలోకి కేతిరెడ్డి వెళ్లేందుకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని.. ఇటీవల కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులే బందోబస్తు నడుమ తనను తాడిపత్రిలో దించాలని ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తనను అడ్డుకున్నారని కేతిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ చేపట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఈ సందర్భంగా కేతిరెడ్డి తరఫు న్యాయవాదులు సిద్ధార్థ్ దావే, పి.సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేశ్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పందిస్తూ.. మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తాడిపత్రికి వెళ్లేందుకు అవసరమైతే ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచించింది. అలాగే అవసరమైన సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. పోలీసు సెక్యూరిటీకి అవసరమైన ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు అంగీకరించారు.ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకుండా ఆయన్ను జేసీ అనుచరులు అడ్డుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా కేతిరెడ్డిని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ నెల 18వ తేదీన పోలీసులే స్వయంగా కేతిరెడ్డిని తాడిపత్రిలో దించిరావాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ అదే రోజున జేసీ వేరే ఈవెంట్ ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని ఆదేశించింది. దీనిపై తాజాగా కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి అనుమతినిచ్చింది. కానీ ఈసారైనా కేతిరెడ్డి తాడిపత్రిలో అడుగుపెడతారా? లేదా ఎప్పటిలాగే సీన్ రిపీట్ అవుతుందా అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.