తిరుపతి : తిరుపతి (Tirupati) జిల్లా కేంద్రంలో ఓ భక్తుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలానికి గురిచేసింది. రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా(Manyam District) సాలూరు గ్రామానికి చెందిన ఉపేంద్ర(52) అనే వ్యక్తి తిరుపతి లాడ్జీ (Lodge)లో ఉంటున్నాడు. గురువారం ఆయన ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు (Police case) సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు గది తలుపులను బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిన వ్యక్తిని గుర్తించారు. లాడ్జీ నిర్వాహకుల వద్ద ఉన్న సమాచారం మేరకు మృతుడు మన్యం జిల్లా వాసిగా గుర్తించిన పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.