అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని పలు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న 33,971 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 11, 356 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 2. 62 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాల్లో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు గాను టీటీడీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నిన్న తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరం తదితర వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పించారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు పేర్కొన్నారు.