ఎన్టీఆర్ జిల్లా : జీవితానికి పరమార్థం రావాలంటే తాము ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యత సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. ఇందుకు విలువలతో కూడిన భాషా పరిజ్ఞానం అవసరమని అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పరిధిలోని ఆత్కూరులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురించింది. ఈ ప్రత్యేక సంచికను వెంకయ్య నాయుడు ఆవిష్కరించి తొలి కాపీని హాస్యనటుడు బ్రహ్మానందంకు అందించారు.
భారతీయ విలువలతో కూడిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని వెంకయ్య సూచించారు. భారత స్వాతంత్య్ర సమరయోధులపై ప్రత్యేక సంచిక తీసుకురావడం ముదావహమన్నారు. నేటి తరం యువతకు సమర యోధుల పోరాట పటిమ గురించి వివరంగా తెలియజెప్పి వారిలో మాతృదేశం పట్ల ప్రేమ, గౌరవం పెరిగేలా చూడాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నిత్యం చదవడం ద్వారా దేశానికి మనమేమిచ్చాం అనే భావన మనలో పెరుగుతుందని చెప్పారు.
తెలుగు సాహితీరంగం అభివృద్ధిలో శ్రీవాణి మాసపత్రిక ప్రాధాన్యాన్ని, వెంకయ్యనాయుడి సేవలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. మంచి విత్తనం మాత్రమే సత్ఫలితాలనివ్వగలదని, అందుకు నిదర్శనమే తెలుగు సాంస్కృతిక మాసపత్రిక శ్రీవాణి, స్వర్ణభారత్ ట్రస్టు అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఇప్పటివరకు సమరయోధులపై సరైన పుస్తకం ఒక్కటీ రాలేదని, శ్రీవాణి ప్రత్యేక సంచిక తీసుకురావడం గొప్ప విషయమని గేయ రచయిత భువనచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి పత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకుడు శ్యామ్‌ప్రసాద్, స్వర్ణభారత్ ట్రస్టు ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు, ట్రస్టు ప్రతినిధులు చుక్కపల్లి ప్రసాద్, పరదేశి, జర్నలిస్ట్ మా శర్మ తదితరులు పాల్గొన్నారు.