Srisailam | శ్రీశైలం, సెప్టెంబర్ 06 : చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
చంద్రగ్రహణం ఈ నెల 7వ తేదీ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు స్వామివారి స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేసినట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని పేర్కొన్నారు. అలాగే సాక్షి గణపతి, హాఠకేశ్వరం, పాలధార, పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తర్వాత శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7.30 గంటల నుంచి శ్రీస్వామి అమ్మవార్లకు మహా మంగళ హారతులు ఇస్తారు. మహా మంగళహారతుల సమయం నుంచి అంటే.. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారు. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి ఆన్లైన్లో స్వామివారి స్పర్శ దర్శనం, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పర్శదర్శనం కల్పించబడుతుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయి. ఆన్లైన్లో స్పర్శ దర్శనం, బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు రాత్రి 9 గంటల నుంచి స్పర్శ దర్శనం కల్పిస్తారు.