Srisailam Temple | శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో క్షేత్ర దారులన్నీ కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసుకుని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూడుగంటల సమయంపడుతున్న అలంకార దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆలయం తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు మజ్జిగ, అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటల నుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. అదే విధంగా కాలినడక శివస్వాములకు భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు మంచినీటిని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు దేవస్థానం వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు నాలుగు రకాల దర్శనాలు మహాశివరాత్రి సందర్భంగా నాలుగు క్యూలైన్ల ద్వారా దర్శనాలను ఏర్పాటు చేసినట్లు ఈవో పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శీఘ్ర (రూ.200), అతి శీఘ్ర (రూ.500), శివస్వాములు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా అటవీ మార్గంలో వస్తున్న భక్తులకు విస్తృత ఏర్పాట్లను చేసినట్లు ఈవో శ్రీనివాసరావు అన్నారు. వెంకటాపురం నుంచి అటవీమార్గంలో గోసాయికట్ట, నాగులూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. కాలినడక భక్తులకు అటవీశాఖ అధికారుల సహాయంతో దేవస్థానం మంచినీరు, వైద్యశిబిరాలు, చలువ పందిర్లు, శౌచవాలయాలు, తాత్కాలిక జనరేటర్లు, విద్యుద్దీకరణ, మూడు భాషల్లో సూచిక బోర్డులు, రూట్ మ్యాప్స్ ఏర్పాటు చేశారు. భీముని కొలను, కైలాసద్వారం మెట్ల మార్గం వరకు మంచినీటి పైపులు ఏర్పాటుచేసి నీటి సరఫర చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు నీటిని వృథా చేయకుండా వినియోగించుకొవాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.