శ్రీశైలం : భక్తుల నుంచి అధిక రుసుం వసూలు చేసినా, దళారులకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న హెచ్చరించారు. పలువురు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆర్జిత సేవా టిక్కెట్ కౌంటర్ల వద్దకు చేరుకుని నేరుగా యాత్రికులతో మాట్లాడారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆన్లైన్, ప్రొటోకాల్ టిక్కెట్ల మినహా మిగతా టిక్కెట్లను పరిమిత సంఖ్యలో మాత్రమే కరెంట్ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని వివరించారు.
క్యూలైన్ల నుంచి టిక్కెట్లు లేకుండా ఆలయ ప్రవేశానికి ఎవరికీ అనుమతి లేదని తెలిపారు. దేవస్థానం నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఆర్జిత సేవా టిక్కెట్ల మంజూరుకు ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసినప్పటికీ పలు ఫిర్యాదులు రావడంపై ప్రత్యేక దృష్టి సారించి యాత్రికులను దళారుల నుంచి కాపాడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని ఆయన అన్నారు. అదే విధంగా దేవస్థానంలో పని చేస్తున్న అత్యవసర అధికారులు, సిబ్బంది మినహా అర్చకులు, పొరుగుసేవలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, యాత్రికులు కూడా ఆలయంలోనికి సెల్ఫోన్లతో ప్రవేశించడానికి అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్తీక మాసంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం అధిక సంఖ్యలో వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దేవస్థానం అమలు చేస్తున్న దర్శన విధానాలను తప్పుదోవపట్టించిన వారికి సహకరించిన సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించినట్లు ఈవో ప్రకటించారు. మీడియా పేరుతో వచ్చిన కొందరు యాత్రికులు రూ.300 శీఘ్ర దర్శన టిక్కెట్లను పొంది నిర్దేశిత క్యూలైన్లో కాకుండా రూ.500 ప్రత్యేక దర్శన క్యూలైన్లో ప్రవేశించడం తోటి భక్తులకు ఇబ్బందిగా మార్చడమే కాకుండా దర్శన పద్ధతులను అస్తవ్యస్తం చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్ల వద్ద సిబ్బందిని మందలించే వీడియోలను వక్రీకరించి సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారాలను భక్తులు అపోహ పడొద్దని ఈవో లవన్న కోరారు.