Srisailam Temple | శ్రీశైలం : మహా శివరాత్రి జాతరకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి గురువారం పర్యటించారు. అనంతరం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ట్రాఫిక్, పార్కింగ్, మంచినీటి సరఫరా, క్యూలైన్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, తాత్కాలిక శౌచాలయాలు, పాతాళగంగలో స్నానఘట్టాల ఏర్పాట్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు వచ్చే జిల్లా యంత్రాంగానికి అవసరమైన వసతి ఏర్పాట్లతోపాటు విధుల్లో ఉండే సిబ్బందికి అల్పాహార వసతులను ప్రత్యేకంగా తెలుసుకున్నారు.
అదే విధంగా యాత్రికుల అత్యవసర సేవల కోసం ప్రత్యేక దృష్టి ఉంచి తగిన ఏర్పాట్లను సమకూర్చడంలో అలసత్వం వహించవద్దని అన్నారు. సమాచార సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతం నుంచి కాలినడకన వచ్చే భక్తులకు మంచినీరు, అల్పాహారాలు వంటి ఏర్పాట్లతోపాటు అటవీశాఖ అధికారుల సూచనలు నిబంధనలను అమలు పరిచేలా భక్తులకు తగు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు, యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు పాల్గొన్నారు.
శ్రీశైల మహాక్షేత్ర వైభవాన్ని యాత్రికులకు తెలియపరిచేందుకు విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాలు ఎంతో విలువైనవని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయమని ఈవో శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయ పీఠాధిపతి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీ విశ్వనాథ్శాస్త్రి, డాక్టర్ పీ మురళీధర్‌రెడ్డి, మ్యూజియం కన్సర్వేటర్ రమేశ్‌బాబు తదితర అధికార బృందం ఈవోను కలిసి వార్షిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో వారితో మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్ర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ భావితరాల వారికి తెలియజేసేలా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇప్పటి వరకు చేసిన పరిశోధనలు, సెమినార్లు, ఆచార్యుల వివరాలు తెలుసుకుని క్షేత్ర దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేకంగా గైడ్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.