Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు అధికారులు షాక్ ఇచ్చారు. కార్తీక మాసంలో నేపథ్యంలో ఆర్జిత సేవల దర్శనాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీక మాసం వేడుకలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దీ రోజుల్లో సామూహిక అభిషేకాలు, వృద్ధ మల్లికార్జున స్వామివారి బిల్వార్చన, అభిషేకాలను సైతం నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. అలాగే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలైన ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలను నిలిపివేసి భక్తులందరికీ అలంకార దర్శనాలు కల్పించనున్నట్లు ప్రకటించారు.
అమ్మవారి ఆలయంలోనూ శ్రీచక్ర కుంకుమార్చనలు ఆలయ ఆశీర్వచన ప్రాకార మండపంలోనే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధారణ రోజుల్లో మూడు విడతలుగా ఉండే స్పర్శదర్శనాల కోసం ఆన్లైన్లో టికెట్స్ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రద్దీ రోజుల్లో రూ.500 టికెట్టు ఉన్నవారికి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. srisailadevasthanam.org, శ్రీశైల దేవస్థానం అఫీషియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సేవా టిక్కెట్లు, స్పర్శ దర్శనం టికెట్స్ను బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఇక వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం, స్వామిఅమ్మవార్ల లీలాకల్యాణం యథావిధిగా జరుగనుండగా.. రుద్ర, మృత్యుంజయ, చండీహోమాలు మాత్రం రెండు విడతలుగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీశైల టీవీ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే పరోక్షసేవలలో పాల్గొనేందుకు ఆన్లైన్లో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవాలని ఈవో కోరారు.