Srisailam | శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించకుండా స్థల పవిత్రతను కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని శ్రీశైలం వన్‌టౌన్ ఎస్సై జీ లక్ష్మణ్‌రావు అన్నారు. వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు సొంత పనుల నిమిత్తం పొరుగు గ్రామాలకు వెళ్లివస్తున్న స్థానికులు కోందరు దేవస్థాన నిబంధనలను అతిక్రమించడం సమంజసం కాదని హెచ్చరించారు.
బుధవారం సాయంత్రం దేవస్థానం టోల్గేట్వద్ద ఆయన పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ మద్యం మాంసాహారాలను తీసుకుని క్షేత్ర ప్రవేశం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాక్షి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక చెక్ పాయింట్ ఏర్పాటు చేస్తామన్నారు.
టోల్ గేట్ వద్ద నిత్యం తనిఖీలు చేసేందుకు ప్రత్యేక విభాగం, పోలీస్ బలగాలు ఉంటాయని లక్ష్మణ్‌రావు చెప్పారు. అలాగే తమ వాహనాలలో మత్తు పధార్ధాలను వెంట తీసుకురావద్దని సూచించారు. హెచ్చరికలు ఉల్లఘించిన వారిపై ఏపీ రిలీజియస్ యాక్ట్ 1987 23/(1)(1)(వీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చెయ్యనున్నట్లు ఎస్సై చెప్పారు.