Srisailam | శ్రీశైలం, మార్చి 09 : శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికులకు సేవలు అందించడంలో అఖిల భారత బ్రాహ్మణ కరివేణ నిత్యాన్నదాన సత్రం అన్ని సత్రాలకు ఆదర్శనీయంగా ఉండటం హర్షించదగినదని ఒలెక్ట్రా సంస్థ చైర్మన్ కేవీ ప్రదీప్ అన్నారు. ఆదివారం కరివేణ సత్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 136 ఏళ్ల క్రితం శ్రీశైల క్షేత్రంలో ప్రారంభమైన నిత్యాన్నదాన సత్రం యాత్రికులకు సేవలందిస్తూ ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో శాఖలుగా విస్తరించడం అభినందనీయమని అన్నారు. దేవస్థానం సూచనలతో కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండేలా వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు సత్ర నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా అరుణాచలం, భద్రాచలంలో భవన నిర్మాణాలతోపాటు తిరుమల తిరుపతి, అయోధ్య నగరంలో కూడా కరివేణ నిత్యాన్నదాన సేవలు త్వరలో ప్రారంభించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటివరకు దేశ విదేశాల నుంచి సత్రం అభివృద్ధికి సహకరించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కామరాజు నరేంద్ర, కోశాధికారి హరిహరరావు, చిదంబరరావు, ప్రదీప్ కుమార్, రామకృష్ణలు పాల్గొన్నారు.